కరోనా సోకిన మహిళ మృతితో కొత్త తలనొప్పులు, సీపీ సజ్జనార్ సందర్శన

కరోనా మహమ్మారి కాటుతో హైదరాబాద్ శివారుకు చెందిన ఓ గ్రామీణ మహిళ మృత్యువాత పడింది. అయితే, ఈ వ్యవహారం అధికారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం కోడూరు గ్రామానికి చెందిన భారతమ్మ(55) ఆకస్మికంగా చనిపోవడంతో పెద్ద దుమారం రేగుతోంది. భారతమ్మ ముందుగా ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలైంది. ఆ తర్వాత ఆమెను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. ఇక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఆమె అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. కానీ ఆ తర్వాత వచ్చిన వైద్య పరీక్షల ఫలితాల్లో ఆమెకు కరోనా పాజిటివ్ ఉందని వైద్యులు నిర్ధారించారు. దీంతో భారతమ్మ స్వగ్రామమైన చేగూర్ గ్రామంలో అలజడి రేగింది. కరోనాతో మృతి చెందిందని తెలుసుకున్న గ్రామస్తులు భయం భయంగా ఉన్నారు. ఈమె వైద్య పరీక్షల ఫలితాలు శుక్రవారమే వచ్చాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం.. కరోనాతో మరణించిన వారి సంఖ్య 2గా ఉంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాలు 11కు చేరుకున్నాయి.



రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండలంలోని చేగుర్ గ్రామాన్ని, శాంతి వనాన్ని శుక్రవారం పోలీస్ యంత్రాగం పరిశీలించింది. మాణిక్యమ్మ అలియాస్ భారతమ్మ కిరాణం షాప్ నడుపుతుండేది. ఈ నెల 31న అనారోగ్య రీత్యా ఉస్మానియాలో చేరడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. అనంతరం వైద్యులు పరీక్షలు నిర్వహించడంతో కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో అప్రమతమైన అధికారులు శాంతి వనాన్నీ, చేగుర్ గ్రామాన్ని హుటాహుటిన పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ తదితరులు గ్రామానికి చేరుకుని పరిశీలించారు.